Osmania: రోగుల తాకిడి తట్టుకోలేక కాలేయ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేసిన ఉస్మానియా ఆసుపత్రి

  • వెయిటింగ్ లిస్టులో 180 మంది పెద్దలు, 360 మంది చిన్నారులు
  • గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్ మెంట్ కు సొంత ఆపరేషన్ థియేటర్ లేని వైనం
  • రోగులకు మళ్లీమళ్లీ సర్జరీలు చేయాల్సి ఉంటుందన్న వైద్యులు

కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కావడంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతుంటారు. అది కూడా తెలంగాణలో కాలేయ మార్పిడి చేసే ప్రభుత్వ ఆసుపత్రి ఒక్క ఉస్మానియా హాస్పిటల్ మాత్రమే కావడంతో రోగుల తాకిడి ఎక్కువైంది. అయితే, మౌలిక సదుపాయాల కొరతతో బాధపడుతున్న ఉస్మానియా కాలేయ మార్పిడి కోసం వస్తున్న రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దాంతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిలిపివేశారు.

ఇప్పటికే 180 మంది పెద్దలు, 360 మంది చిన్నారులు కాలేయ మార్పిడి జాబితాలో వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. గత అక్టోబరులో ప్రారంభమైన ఉస్మానియాలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ఇప్పటివరకు 14 కాలేయ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించింది. అయితే, తమ డిపార్ట్ మెంట్ కు ఇప్పటికీ ఓ ఆపరేషన్ థియేటర్ కూడా లేదని, సోమవారం, గురువారం జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ కు చెందిన ఆపరేషన్ థియేటర్ లోనే కాలేయ శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

కాలేయ శస్త్రచికిత్సలు ఒక్కరోజుతో పూర్తిచేయలేమని, ఒకరోజు శస్త్రచికిత్స నిర్వహించిన రోగికి మరుసటి రోజు మరలా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయని, రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ అందుబాటులో లేకపోతే చాలా రిస్క్ అని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News