Cricket: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన సఫారీలు... మిణుకుమిణుకుమనే ఆశలతో పాకిస్థాన్!
- ఆరు మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్
- 2 గెలుపు, 3 ఓటములు, 1 డ్రా
- 5 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్
- 7 మ్యాచ్ లు ఆడి 3 పాయింట్లకే పరిమితమైన సౌతాఫ్రికా
ఈ వరల్డ్ కప్ క్రికెట్ పోటీలో ఎన్నో అంచనాలతో రంగంలోకి దిగిన సౌతాఫ్రికా, నాకౌట్ నుంచి నిష్క్రమించింది. నిన్న పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు ఇక సెమీస్ చేరే అవకాశాలు లేనట్టే. ఇదే సమయంలో పాకిస్థాన్ మాత్రం మిణుకుమిణుకుమనే ఆశలతో సెమీస్ అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప పాక్ జట్టు కూడా సెమీస్ కు చేరే అవకాశాలు దాదాపు లేనట్టే.
ఎందుకంటే, దక్షిణాఫ్రికా 7 మ్యాచ్ లు ఆడి మూడు పాయింట్లతోనే ఉంది. ఆ జట్టు తానాడే మిగతా రెండు మ్యాచ్ లూ గెలిచినా, 7 పాయింట్లకు మాత్రమే చేరుతుంది. ఇప్పటికే నాలుగు జట్లు 8 లేదా, అంతకన్నా ఎక్కువ పాయింట్లను పొందాయి కాబట్టి సఫారీలకు చాన్స్ నిల్. ఇక పాక్ విషయానికి వస్తే, ఆరు మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు, ఒక డ్రాతో 5 పాయింట్లతో ఉంది. ఆ జట్టుకు ఇంకో మూడు మ్యాచ్ లు ఉన్నాయి. మూడింట్లో గెలుస్తుందనుకున్నా 11 పాయింట్లకు చేరుతుంది. అది జరగడం అద్భుతమే.
మరో మూడేసి మ్యాచ్ లు ఆడాల్సివున్న న్యూజిలాండ్ 11, ఆస్ట్రేలియా 10, ఇంగ్లండ్ 8 పాయింట్లతో ఉండగా, నాలుగు మ్యాచ్ లు ఆడాల్సివున్న ఇండియా 9 పాయింట్లతో ఉంది. మూడు మ్యాచ్ లు ఆడే శ్రీలంక 6 పాయింట్లతో, బంగ్లాదేశ్ 5 పాయింట్లతో పాక్ కన్నా ముందున్నాయి. మిగతా 3 మ్యాచ్ లలో పాక్ కనీసం రెండు గెలుస్తుందని భావించినా, సెమీస్ చేరడం కష్టమే. ఇప్పటికే ఆఫ్గనిస్థాన్ జట్టుతో పాటు సౌతాఫ్రికా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించగా, అదే దారిలో వెస్టిండీస్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఉన్నాయనే భావించాలి.