Warangal Urban District: వరంగల్లో బీజేపీ నిరసన... కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా మంటలంటుకుని గాయపడిన కార్యకర్త!
- మంటలు అంటుకుని ముగ్గురికి గాయాలు...ఒకరి పరిస్థితి విషమం
- గాయపడిన అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మారావు
- చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించాలంటూ ఆందోళన
తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పట్టణంలో ఈరోజు బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనలో అపశ్రుతి చోటు చేసుకుంది. అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలోని అంబేడ్కర్ సెంటర్లో ఉదయం 11 గంటల సమయంలో ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అయితే, బొమ్మపై కిరోసిన్ పోస్తున్నప్పుడు ఓ కార్యకర్తపై కిరోసిన్ పడింది. అదే సందర్భంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రావడంతో తోపులాట జరగడం, ఆ సమయంలోనే బొమ్మకు నిప్పంటించడంతో కిరోసిన్ పడిన శ్రీను అనే కార్యకర్తకు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న పద్మారెడ్డికి కూడా నిప్పంటుకుని ఆమె చేతికి గాయాలయ్యాయి. మరో మహిళా కార్యకర్త చీరకు నిప్పంటుకుని గాయపడింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.