Andhra Pradesh: ప్రధాన ద్వారం కాదు.. వెనుకగేటు నుంచి వెళ్లండి.. ప్రజావేదిక వద్ద టీడీపీ నేతలకు పోలీసుల ఆదేశం!
- తీవ్రంగా మండిపడ్డ టీడీపీ నేతలు
- తాము ఎలాంటి ఆందోళన చేయలేదని స్పష్టీకరణ
- అలాంటప్పుడు ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్న
- చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టంలేకే కూల్చివేత: బుద్ధా వెంకన్న
టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగవచ్చన్న అనుమానంతో ప్రజావేదిక వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పలు ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల రీత్యా టీడీపీ నేతలను ప్రధాన ద్వారం గుండా అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
ఈ ప్రాంగణం వెనుకగేటు నుంచి వెళ్లాలని సూచించారు. దీనిపై పలువురు టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము ఎలాంటి గొడవ చేయకపోయినా పోలీసులు ఆంక్షలు విధించడం ఏంటని మండిపడ్డారు. ప్రజావేదికలో మీటింగ్ పెట్టి దాన్నే కూల్చేస్తామని చెప్పడం సరికాదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. చంద్రబాబుకు ప్రజావేదిక ఇవ్వడం ఇష్టంలేకే దాన్ని కూలగొడుతున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం కరెక్టు కాదని హితవు పలికారు.