Rajanna Sircilla District: ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం చేస్తున్నా: కేటీఆర్
- తెలంగాణలో టీఆర్ఎస్ అజేయశక్తిగా ఎదుగుతుంది
- తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తాం
- దసరా నాటికి సిరిసిల్లకు సాగునీరు తీసుకొస్తాం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అజేయశక్తిగా ఎదుగుతుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తమకే పట్టం కడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం దేవుడితోనైనా తలపడే మనస్తత్వం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
నా తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులే
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని, దసరా నాటికి సిరిసిల్లకు సాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ యావత్తు దేశం దీని వైపే చేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. తన తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులేనని, మిడ్ మానేరు ప్రాజెక్టులో తన తల్లి కూడా భూమిని పోగొట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు ఓ పండగలా నిర్వహించాలి
ఈ నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కేసీఆర్ ప్రారంభిస్తారని, దీనిని ఓ పండగలా నిర్వహించాలని అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై టీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించున్నట్టు చెప్పారు.