Election Result: బీజేపీలో చేరడానికి సిద్ధమైన టీఎంసీ కౌన్సిలర్లు.. వార్నింగ్ ఇచ్చిన పార్టీ!
- బీజేపీలోకి వెళ్లేందుకు 18 మంది కౌన్సిలర్లు సిద్ధం
- నష్ట నివారణ చర్యలు చేపట్టిన అధిష్ఠానం
- పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిక
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో చేరిపోతారో తెలియని పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీగా స్థానాలను గెలుచుకున్న అనంతరం ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే ఈ ఆకర్ష్‌కు పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకోగా మరికొందరు క్యూలో ఉన్నారు.
అయితే.. ఈసారి 18 మంది కౌన్సిలర్లు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధిష్ఠానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. పార్టీ మారితే తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటాయని అధిష్ఠానం బెదిరింపులకు పాల్పడింది. ఏ పార్టీలోకి వెళ్లినా సరే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే తాట తీస్తామని టీఎంసీ అధిష్ఠానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి, తృణముల్ వార్నింగ్‌ను లెక్క చేస్తారా? లేకుంటే కమలం గూటికి వెళ్లిపోతారా..? అనేది తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాలి.