Jangan: సంక్షేమం కన్నా విధ్వంసంపై జగన్ దృష్టిపెట్టడం దురదృష్టకరం: యనమల
- ప్రజావేదిక కూల్చివేత నిర్ణయమొక తుగ్లక్ చర్య
- లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కూల్చివేత నిర్ణయం
- పోలవరం నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా?
అమరావతిలోని ప్రజావేదిక భవనం అక్రమ కట్టడమని.. ఎల్లుండి కూల్చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో షాకింగ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రకటనను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ప్రజావేదిక భవనం కూల్చివేత నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. కొత్త భవనాలను నిర్మించడంపై దృష్టిపెట్టకుండా ఉన్నవాటిని ఊడగొట్టడం సరైన చర్యకాదన్నారు. సంక్షేమం కన్నా, విధ్వంసంపై దృష్టిపెట్టడం దురదృష్టకరం అని యనమల చెప్పుకొచ్చారు.
కాగా.. ప్రజావేదిక భవనం టీడీపీకి ఇవ్వాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. ఈ విషయాన్ని ప్రస్తావించిన యనమల.. లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రజావేదికను కూల్చివేయాలనే సర్కార్ నిర్ణయించిందని ఆరోపించారు. సచివాలయంలోని భవనాలను.. 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా? అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని యనమల ప్రశ్నించారు.