Rain: రాత్రి గంటన్నర పాటు దంచికొట్టిన వాన... తెల్లారగానే హైదరాబాద్ వాసుల అవస్థలు!
- ఒంటిగంట తరువాత మొదలైన వర్షం
- మూడు వరకూ వివిధ ప్రాంతాలను ముంచెత్తిన వైనం
- రోడ్లపై నిలిచిన నీరు.. ట్రాఫిక్ జామ్
గత రాత్రి ఒంటిగంట తరువాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురవగా, మురుగు నీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేక రోడ్లపైకి నీరు చేరింది. తెల్లారగానే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలకు రోడ్లపై మేట వేసిన ఇసుక, అరడుగుకు పైగా నిలిచిన నీరు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా మూసాపేట వై జంక్షన్, అమీర్ పేట, పంజాగుట్ట నిమ్స్, ఉప్పల్ చౌరస్తా, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మాదాపూర్ ఫ్లయ్ ఓవర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.
ఇదిలావుండగా, తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరుణుడు పలకరించాడు. కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో చెట్లు విరిగి పడ్డాయి. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.