praja vedika: ప్రజావేదికను తొలగిస్తే.. ప్రభుత్వ ఖజానాకు రెండు రకాల నష్టం: కేశినేని నాని
- ప్రజా ధనంతో ప్రజావేదికను నిర్మించారు
- దీన్ని కూల్చి వేస్తే ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది
- ప్రైవేట్ వేదికల్లో సమావేశాలను నిర్వహిస్తే... మళ్లీ ప్రజా ధనం ఖర్చవుతుంది
ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న ప్రజావేదికను కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ... ఇప్పటికిప్పుడు ఈ కట్టడాన్ని కూల్చివేస్తే ప్రభుత్వ ఖజానాకు రెండు రకాలుగా నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రజావేదిక అక్రమమా? లేదా సక్రమమా? అనే విషయాన్ని పక్కనపెడితే... అది ప్రజా ధనంతో నిర్మించిన కట్టడమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. దీన్ని కూల్చి వేస్తే ప్రజాధనం దుర్వినియోగమవుతుందని చెప్పారు. మరో వేదికను నిర్మించేంత వరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు మళ్లీ ప్రజాధనం ఖర్చవుతుందని అన్నారు. ముందుగా ఇతర అక్రమ కట్టడాలను తొలగించాలని... ఈలోపు కొత్త సమావేశ వేదికను నిర్మించి, ఆ తర్వాత ప్రజావేదికను తొలగిస్తే బాగుంటుందని సూచించారు.