vijaysai reddy: టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?: విజయసాయి రెడ్డి
- నదీగర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
- ఈ కట్టడాలు ఇల్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు
- వ్యవస్థలను మేనేజ్ చేసి పెద్దలు కట్టుకున్నవి
అమరావతిలోని ప్రజావేదికను కూల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నదీగర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఈ అక్రమ కట్టడాలు ఇల్లు లేని పేదలు కట్టుకున్నవి కాదని.. వ్యవస్థలను మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవని చెప్పారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారని... ఇకపై అలాంటివి సాధ్యం కావని అన్నారు.
విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని... అందువల్లే వాటి పనులు మొదలు కాలేకపోయాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. భూసేకరణ తామే చేస్తామని తొలుత కేంద్రానికి హామీ ఇచ్చారని... ఆ తర్వాత చెరి సంగం భరించాలనే మెలిక పెట్టారని అన్నారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా చెప్పారని తెలిపారు.