Narendra Modi: ఎన్నికల్లో గెలుపోటముల గురించి మేము ఆలోచించం: ప్రధాని మోదీ
- ప్రజల కోసం ఏం చేశామనేదే ఆలోచిస్తాం
- మొన్నటి ఎన్నికలు చాలా ప్రత్యేకం
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది
ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాము ఎక్కువగా ఆలోచించమని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చేశామనేదే ఆలోచిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానమిస్తూ ప్రసంగించారు.
మొన్నటి ఎన్నికలు చాలా ప్రత్యేకమని, తమపై భరోసా ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని, గిరిజనులు, ఆదివాసీలు కూడా తమ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేశారని చెప్పారు. ఐదేళ్లలో తాము అందించిన పరిపాలనకు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయని, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం వ్యవస్థలతో పోరాడుతున్నారని, అనేక ఇబ్బందులను అధిగమించి దేశం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధికి తగిన చేయూత అందిస్తున్నామని, డెబ్బై ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితి మారేందుకు కొంత సమయం పడుతుందని, తమ ముఖ్య లక్ష్యం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకు వెళ్లమని స్పష్టం చేశారు.