Undavalli: కూల్చివేతలు కేవలం ప్రజావేదికకే పరిమితం చేయొద్దు: కన్నా లక్ష్మీనారాయణ
- ఒక పాలసీగా తీసుకుని కూలిస్తే అభ్యంతరం లేదు
- కక్షసాధింపు కోసమైతే ప్రజావేదికను కూల్చొద్దు
- ప్రజా అవసరాలకు ఉపయోగించడం మంచిది
ప్రజావేదికను కూల్చివేయడం కంటే ప్రజా అవసరాలకు ఉపయోగించడం మంచిదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక పాలసీగా తీసుకుని అక్రమ కట్టడాలను కూలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కక్షసాధింపు కోసం దాన్ని కూల్చాలనుకుంటే మాత్రం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు.
ప్రజావేదిక కోసం ప్రజాధనం రూ.8 కోట్లను చంద్రబాబు దుర్వినియోగం చేశారని, అదే ప్రజాధనాన్ని కాలువలో వేయకుండా ప్రజలకు ఉపయోగించుకోమని జగన్ కు చెబుతున్నానని అన్నారు. బీజేపీ నేత గోకరాజు గంగరాజుకు చెందిన అక్రమ కట్టడం కూడా ఇందులో ఉందన్న ప్రశ్నకు కన్నా స్పందిస్తూ, అన్ని పార్టీల నేతలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వీటి కూల్చివేతను ఓ పాలసీ మేటర్ గా తీసుకుంటే తమ నుంచి ఎటువంటి విమర్శలూ ఉండవని స్పష్టం చేశారు. గోకరాజు గంగరాజు కావచ్చు, మరో నేత కావచ్చు, ఎవరు కట్టినా తమ సొంత డబ్బుతో నిర్మాణాలు చేసుకున్నారని చెప్పారు.