praja vedika: కొనసాగుతున్న ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ!
- తొలుత ప్రహరీని కూల్చేసిన అధికారులు
- రాత్రి 11 గంటల సమయంలో ప్రధాన భవనం కూల్చివేత
- భారీగా మోహరించిన పోలీసులు
గత రాత్రి ప్రారంభమైన ప్రజావేదిక కూల్చివేత పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కలెక్టర్ల సదస్సు ముగియగానే ప్రారంభమైన కూల్చివేత ప్రక్రియ రాత్రంతా కొనసాగుతూనే ఉంది. ప్రజావేదిక కూల్చివేతకు మొదటి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు అడ్డుకునే అవకాశం ఉండడంతో ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 70 మంది సివిల్, మరో 70 మంది ఆర్మ్డ్ రిజర్వు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తొలుత కరకట్టను పోలీసులు తమ అధీనంలోకి తీసుకోగా, ప్రజావేదికలోని సామాన్లను సీఆర్డీయే అధికారులు బయటకు తరలించారు. పూల కుండీలను నర్సరీకి, ఇతర సామగ్రిని సచివాలయానికి చేర్చారు. అనంతరం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కూలీలు సమ్మెటలతో గోడలు పగలగొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత 3 జేసీబీలు, 6 టిప్పర్లను రంగంలోకి దిగాయి. రాత్రి 11.15 గంటల సమయంలో ‘ప్రజా వేదిక’ ప్రధాన భవనం కూల్చివేత పనులు మొదలయ్యాయి. భవనాన్ని కూల్చి వేస్తున్నారని తెలిసి రాజధానికి చెందిన కొందరు రైతులు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని పంపించేశారు.