Jagan: రాజధాని అమరావతిపై జగన్ మనసులో ఏముంది?: సీఆర్డీఏపై సమీక్ష నేడే
- సీఆర్డీఏపై ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష
- ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
- మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం
తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా భావించిన రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం వైఖరి ఏమిటి? ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మనసులో ఏముంది? అనే అంశం ఈరోజు తేలిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఆర్డీఏపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
గడచిన నాలుగున్నరేళ్లుగా అమరావతిలో జరుగుతున్న పనుల ప్రగతి, ఇతర అంశాలపై అధికారుల నుంచి నివేదిక కోరనున్నారు. రాజధాని నిర్మాణంపై తొలినుంచీ వైసీపీ విమర్శలు కురిపిస్తూవస్తోంది. అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప వాస్తవం లేదంటూ ఆరోపించింది. పైగా రైతుల భూములు బలవంతంగా లాక్కుని వారికి అన్యాయం చేశారని ఆరోపించింది. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని వేరొక ప్రాంతానికి మారుస్తారంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న వైసీపీ రాజధాని నిర్మాణంపై ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నదన్నది ఆసక్తికరంగా మారింది. తొలిసారి ముఖ్యమంత్రి రాజధాని వ్యవహారాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నందున కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.