Kumaram Bheem Asifabad District: అన్యాయం చేశాడని వీఆర్ఏను రెవెన్యూ కార్యాలయంలోనే చెప్పుతో కొట్టిన మహిళ
- తన భూమికి అక్రమ పట్టా ఇచ్చేందుకు సహకరించాడని ఆగ్రహం
- రెండేళ్లుగా నడుస్తున్న భూ వివాదం
- దాడిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన వీఆర్ఏ
తమకు చెందిన భూమిపై వేరొకరికి పట్టాలు ఇచ్చేందుకు సహకరించారన్న కోపంతో ఓ మహిళ ఊగిపోయింది. రెండేళ్లుగా నడుస్తున్న వివాదం పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనానికి గురైన సదరు మహిళ నిన్న కుమరం భీం జిల్లా రెబ్బెన రెవెన్యూ కార్యాలయంలో చెప్పుతో వీఆర్ఏను చితకబాదింది.
వివరాల్లోకి వెళితే... జిల్లాలోని కిష్టాపూర్‌కి చెందిన సోదరులు దుర్గం దుర్గయ్య, సాంబయ్యలకు వారసత్వంగా కొంత భూమి వచ్చింది. ఈ భూమిపై అదే గ్రామానికి చెందిన దుర్గం ప్రభాకర్, మల్లయ్యలు పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ సాంబయ్య కొడుకు శ్రీనివాస్ రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ వివాదంపై గత నెల 29న తహసీల్దార్ కార్యాలయం ఎదుట శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం కార్యాలయానికి వస్తే సమస్య పరిష్కరిస్తానని ఆర్డీఓ సిడాం దత్తు సమాచారం ఇచ్చారు.
దీంతో సాంబయ్య కుటుంబ సభ్యులు దుర్గం శ్రీనివాస్, మల్లయ్య, పోషయ్య, దుర్గం లక్ష్మి, జమున, అమృత తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే, అధికారుల జాడ సాయంత్రం వరకు లేకపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న వీఆర్ఓ ఉమ్‌లాల్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా ఈ వివాదానికి అసలు కారకుడు కిష్టాపూర్ వీఆర్ఏ జానకయ్య అని భావించిన దుర్గం లక్ష్మి చెప్పుతీసి అతన్ని కొట్టింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. కాగా, వివాదంతో తనకు సంబంధం లేకున్నా తనపై దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్ఏ జానకయ్య తహసీల్దార్‌ను కోరారు.