assembly sessions: వచ్చేనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..15 రోజులపాటు నిర్వహణ
- 12వ తేదీన వైసీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్
- ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
- రైతు సంక్షేమంపై కీలక నిర్ణయాలకు అవకాశం
ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. జూలై 11వ తేదీ నుంచి పదిహేను రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో 12వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈనెల 12వ తేదీ నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం వంటి అంశాలపై చర్చ నిర్వహించి సభను వాయిదా వేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వచ్చేనెల జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఇందుకోసం జూలై ఒకటి, రెండు తేదీల్లో ఆయన మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులకు వడ్డీలేని రుణాలు, పంట బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడం వంటి అంశాలతోపాటు నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.