Andhra Pradesh: ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు మాకు సహకరించాలి!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- పోలవరాన్ని సవరించిన అంచనాలతో కేంద్రం పూర్తిచేయాలి
- రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని జగన్ అనుకుంటున్నారు
- రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ
వైసీపీ అధినేత జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. కులం, అవినీతితో పెచ్చరిల్లిన టీడీపీని కూకటివేళ్లతో పెకిలించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఈరోజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను అవినీతిరహిత రాష్ట్రంగా చేయాలని సీఎం జగన్ తపన పడుతున్నారని చెప్పారు. తద్వారా ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇటీవల జరిగిన నీతిఆయోగ్ భేటీలో సీఎం జగన్ కోరిన విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నాడు విభజన ప్రక్రియ సమయంలో ఇదే సభలో వున్న నేటి చైర్మన్ వెంకయ్యనాయుడు ఇప్పుడు ఏపీకి న్యాయం చేసేందుకు సహకరించాలని కోరారు. పోలవరాన్ని సవరించిన అంచనాలతో నిర్ణీత గడువులోగా నిర్మించాలని చెప్పారు. వీటితో పాటు కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పెట్రో కారిడార్ ను కేంద్రం పూర్తిచేయాలని విజయసాయిరెడ్డి కోరారు.