Guntur District: మంగళగిరిలో టీడీపీ నాయకుడి హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం: నారా లోకేశ్
- వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ హత్యలు
- అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
- హత్యా రాజకీయాలను డీజీపీ దృష్టికి తీసుకెళతాం
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత ఉమా యాదవ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకుడు ఉమా యాదవ్ ను అతి దారుణంగా హత్య చేశారని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఏనాడూ హత్యా రాజకీయాలను టీడీపీ ప్రోత్సహించలేదని చెప్పారు. 2014లో టీడీపీ గెలిచినప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడా గొడవలు జరగలేదని గుర్తుచేశారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెలరోజులు అవుతోందని, ఈ నెలలో దాదాపు 130 మంది కార్యకర్తలను ఇబ్బందిపెట్టారని వైసీపీపై ఆరోపణలు చేశారు. కేవలం తమ కార్యకర్తలనే కాదని, టీడీపీకి ఓటేసిన సామాన్య ప్రజలను కూడా వైసీపీ ఇబ్బంది పెట్టిందని, గత నెలలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందని, వీటిపై ఓ ఎంక్వరీ వేసి, చట్టం తన పని చేసే విధంగా అధికారులందరూ సహకరించాలని కోరుతున్నానని అన్నారు.
రేపు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని, హత్యా రాజకీయాలను ఆయన దృష్టికి తీసుకెళతామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ హత్యలు చేస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఈ సందర్భంగా తమ కార్యకర్తలకు సూచించారు.