Ex-prime minter: పీవీ, ప్రణబ్ లపై టీ-కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ
- సోనియా అనుచరులను అణగదొక్కాలని చూశారు
- నాగపూర్ సభకు వెళ్లడంతో ప్రణబ్ కు ‘భారతరత్న’ వచ్చింది
దివంగత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఆరోపించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు రాజకీయాలు మానుకొని హైదరాబాద్ లో ఉన్న పీవీని సోనియా గాంధీ పిలిచి ఆయన్ని ప్రధానిని చేశారని గుర్తుచేశారు. కానీ, పీవీ మాత్రం తనను ప్రధానిని చేసిన కాంగ్రెస్ పార్టీతో పాటు సోనియాగాంధీ అనుచరులను ఎందరినో అణగదొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. పార్టీ సీనియర్ నేతలను ఎందరినో పీవీ తొక్కేసే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు.
బాబ్రీ మసీదును కూల్పించి పీవీ పెద్ద తప్పు చేశారని, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. అందుకే, పీవీ నరసింహారావును గాంధీ కుటుంబం పక్కన పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్పించినందుకే పీవీని బీజేపీ నేతలు పొగుడుతున్నారని అన్నారు.
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ పైనా చిన్నారెడ్డి విమర్శలు చేశారు. నాడు నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ సభకు ప్రణబ్ వెళ్లారని, అందువల్లే, ఆయన భారతదేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను పొందారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.