vijayanirmala: ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల
- బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూత
- తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
అలనాటి మేటి నటి, దర్శకురాలు, నటుడు కృష్ణ భార్య విజయనిర్మల బుధవారం రాత్రి గుండెపోటుతో (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయనిర్మల తండ్రిది చెన్నై కాగా, తల్లి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు. 20 ఫిబ్రవరి 1946లో జన్మించిన విజయనిర్మల ఏడేళ్ల వయసులో 'మత్స్యరేఖ' అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పదకొండేళ్ల వయసులో ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.
‘రంగులరాట్నం’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు, తాతామనవడు, కురుక్షేత్రం, తదితర చిత్రాల్లో నటించారు.
‘పెళ్లి కానుక’ సీరియల్తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు. విజయనిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు సీనియర్ నరేశ్ ఆమె కుమారుడే. విజయనిర్మల మృతి వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.