Andhra Pradesh: ప్రజావేదిక నిర్మాణంలో సిమెంట్ కంటే ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ను ఎక్కువగా వాడారనిపిస్తోంది!: విజయసాయిరెడ్డి
- రూ.కోటి ఖర్చయ్యే రేకుల షెడ్డుకు రూ.9 కోట్లు వెచ్చించారు
- బాబు హయాంలో నిర్మాణాలన్నీ ఇంతే
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ప్రజావేదిక కూల్చివేతపై రగడ కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. ప్రజావేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంటు కంటే సినిమా సెట్టింగుల్లో వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గట్టిగా రూ.కోటి ఖర్చయ్యే ఈ తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు ఖర్చయినట్లు చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలు అన్నీ ఇలాగే ఉంటాయని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రజావేదిక కూల్చివేత దగ్గరకు వచ్చిన ప్రజలకు ఉన్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ‘రాజధాని కోసం మా నుంచి 33,000 ఎకరాలు సేకరించారు. ప్రజావేదికను కరకట్ట మీద కాకుండా రాజధాని భూముల్లోనే నిర్మించి ఉంటే ఈరోజు ప్రజాధనం వృధా అయ్యేది కాదు కదా’ అని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.