Andhra Pradesh: ప్రజావేదికను ఆసుపత్రిగా మార్చి వుంటే బాగుండేది!: కన్నా లక్ష్మీనారాయణ
- జగన్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు
- 8 కోట్లు నీళ్లలో పోసినట్టయింది
- అమరావతిలో మీడియాతో బీజేపీ ఏపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సర్కారు నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేయడంపై ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆచితూచి స్పందించారు. ప్రజావేదికను కూల్చడం అన్నది సీఎం జగన్ తీసుకున్న తొందరపాటు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా ప్రజావేదికను ఓ ఆసుపత్రిగా మార్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతానికి అయితే సీఎం జగన్ బాగానే పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రజావేదిక అన్నది రూ.8 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనమనీ, తాజా కూల్చివేతతో ఆ మొత్తాన్ని నీళ్లలో పోసినట్లు అయిందని చెప్పారు. టీడీపీ లేకుండా చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు, లోకేశ్ పనిచేస్తున్నారనీ, కాబట్టి బీజేపీకి ఎలాంటి ప్రయాస అవసరం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ, చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు.