Andhra Pradesh: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం.. అనంతపురంలో రోడ్డెక్కిన రైతన్న!
- వేరుశనగ విత్తనాలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం
- ఖరీఫ్ సీజన్ ప్రారంభమయినా పట్టించుకోవట్లేదని ఆవేదన
- రైతులను శాంతింపజేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో మరోసారి రైతులు రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ మొదలయినా వ్యవసాయ శాఖ అధికారులు వేరుశనగ విత్తనాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పామిడి పట్టణంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు.
ఈ ఖరీఫ్ సీజన్ లో అనంతపురం జిల్లాకు 3 లక్షల క్వింటాల వేరుశనగ విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ కనీసం సగం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. ఈ విషయమై ఓ రైతు మాట్లాడుతూ.. రెండు రోజులకు ఓసారి విత్తనాలను సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారులు చెప్పారని తెలిపారు. కానీ గత 10 రోజులుగా వేరుశనగ విత్తనాలు అందివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.