Jagan: జగన్ గారు అని పిలవలేరా?... టీడీపీ నాయకులు ఒక్కొక్కడూ ఒక్కో వీధిరౌడీలా మాట్లాడుతున్నారు: వాసిరెడ్డి పద్మ ఫైర్
- మీరు గెలిచిన స్థానాలన్నీ అత్తెసరు ఓట్లతో గెలిచారు
- ప్రజలకు గౌరవం ఇవ్వడమే ప్రజాస్వామ్యం
- ప్రజలు అంత గొప్పగా గెలిపించిన వ్యక్తిని ఏకవచనంలో పిలుస్తారా?
టీడీపీ నాయకులపై వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. జగన్ ఓ ముఖ్యమంత్రి అనే విషయం కూడా గుర్తెరగకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఒక్కొక్కడూ ఒక్కో వీధిరౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మీరు గెలిచిన స్థానాలన్నీ అత్తెసరు ఓట్లతో గెలిచారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించారు. 151 స్థానాల్లో తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. అలాంటి వ్యక్తిని 'గారు' అని పిలవడానికి మీకు మనసు రావడంలేదా? జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. ఈ దేశంలో ఎవరికీ రానంతగా 50 శాతం ఓటింగ్ తో ఆయన సీఎం పీఠం అధిష్ఠించారు. ప్రజలు అంత గొప్పగా గెలిపించిన వ్యక్తిని ఏకవచనంతో పిలుస్తారా? ప్రజలకు గౌరవం ఇవ్వడమే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇవాళ మీరు ప్రజలు ఎన్నుకున్న నాయకుడ్ని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అక్రమాన్ని అక్రమం అంటే మీకెందుకు ఉలుకు? " అంటూ ధ్వజమెత్తారు.