GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ వాహనంపై పెండింగ్ చలాన్లు... సోషల్ మీడియాలో ఏకిపడేసిన నెటిజన్లు!
- 2018 నుంచి కమిషనర్ వాహనంపై ఆరు చలాన్లు
- రూ.6,210 జరిమానా విధింపు
- ఎట్టకేలకు చెల్లించిన జీహెచ్ఎంసీ
అతివేగంగా వెళ్లే వాహనాలను స్పీడ్ గన్ తో ట్రాక్ చేసి జరిమానాను చలాన్ల రూపంలో పంపించే విధానం హైదరాబాద్ లో ఎప్పట్నించో అమల్లో ఉంది. సాధారణమైన వ్యక్తులు చలాన్లకు గురికావడం, జరిమానా చెల్లించకుండా చలాన్లు పెండింగ్ లో పెట్టడం చూస్తుంటాం. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్లు కూడా చలాన్లు పెండింగ్ లో ఉంచితే! అది కూడా జరిగింది.
హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కమిషనర్ కు చెందిన వాహనంపై చలాన్లు భారీగా పెండింగ్ లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ కారు (టీఎస్ 09ఎఫ్ఏ 4248) ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకు ట్రాఫిక్ సిబ్బంది చలాన్లు విధించారు. ఇప్పటివరకు ఆరు సార్లు అతివేగంతో ప్రయాణించినట్టు రికార్డయింది. 2018 నుంచి ఈ కారుపై మొత్తం రూ.6,210 జరిమానా విధించారు. ఇక, నెటిజన్ల కారణంగా ఈ విషయం సోషల్ మీడియాలో హైలైట్ కావడంతో జీహెచ్ఎంసీ వర్గాలు వెంటనే జరిమానా మొత్తాన్ని చెల్లించేశాయి. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఓవర్ స్పీడ్ ఎందుకు అంటూ డ్రయివర్ ను మందలించినట్టు తెలుస్తోంది.