Mansoor Khan: ఒక్క అవకాశమిస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేసి చూపిస్తా: తమిళ నటుడు
- ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు
- కోర్టు పర్యవేక్షణలోనే నిరూపిస్తా
- సుప్రీంకోర్టులో నటుడు మన్సూర్ అలీ ఖాన్ రిట్ పిటిషన్
తనకు ఒక్క చాన్స్ ఇస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను ట్యాంపర్ చేసి చూపిస్తానని బల్లగుద్ది మరీ చెబుతున్నారు తమిళ నటుడు, ఎన్టీకే నేత మన్సూర్ అలీ ఖాన్. ఈ మేరకు గురువారం ఆయన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తనకు అనుమతి ఇస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపిస్తానని పేర్కొన్నారు. ఇందుకోసం తనకు అనమతి ఇచ్చేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు, లేదంటే హైకోర్టు పర్యవేక్షణలో ఈవీఎంలను ట్యాంపర్ చేసి, అవకతవకలకు అవకాశం ఉందని నిరూపిస్తానని మన్సూర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని దిండిగుల్ స్థానం నుంచి మన్సూర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మన్సూర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.