Chandrababu: చంద్రబాబు నివాసానికి సీఆర్డీయే నోటీసులు... వారం రోజుల గడువు!
- ఈ ఉదయం నోటీసులు
- నిర్మాణాలకు అనుమతులు లేవు
- నదికి 100 మీటర్లలోపే నిర్మాణాలు
- వారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశం
కృష్ణానదీ కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు పంపించారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉందన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇది టీడీపీ నేత లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్. 2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం దీనిలోనే స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్, అదనపు గదులను నిర్మించి, చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు.
ఈ ఉదయం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్న అధికారులు నోటీసులను లింగమనేని రమేశ్ పేరిట జారీ చేశారు. కరకట్టపై అక్రమంగా ఈ భవంతిని నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. గెస్ట్ హౌస్ సహా స్విమ్మింగ్ పూల్, హెలీ ప్యాడ్ లకు అనుమతి లేదని ప్రస్తావించారు. కృష్ణానదికి 100 మీటర్ల లోపే నిర్మాణం ఉందని, దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.