Donald Trump: 'వెరీ బిగ్ ట్రేడ్ డీల్'... మోదీతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
- ఒసాకాలో జరుగుతున్న జీ-20 సమ్మిట్
- ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ, ట్రంప్
- త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుందన్న ట్రంప్
- చర్చలు ఫలవంతం అయ్యాయన్న ఇండియా
ఒసాకాలో జరుగుతున్న జీ-20 సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత్ తమకు అత్యంత మిత్రదేశమని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకునేందుకు కట్టుబడివున్నామని చెబుతూ, రెండు దేశాల మధ్యా అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదరనుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్పత్తి రంగానికి సంబంధించిన డీల్ ఇదని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అన్నారు.
కాగా, వీరిద్దరూ ఇరాన్ వ్యవహారాలు, 5జీ నెట్ వర్క్, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరు, రక్షణ దళాల విషయంలో పరస్పర సహకారం, ఉపఖండంలో శాంతి, ట్రేడ్ డెఫిషిట్ ను అధిగమించడంపైనా చర్చలు సాగాయని వైట్ హౌస్ ఓ ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్యా నెలకొన్న పన్ను వివాదాలను పరిష్కరించుకోవడంపైనా మాటలు సాగాయని పేర్కొంది.
ఇదిలావుండగా, చర్చలు ఫలవంతం అయ్యాయని, వాణిజ్యపరంగా ఇండియా తీసుకుంటున్న చర్యలను ట్రంప్ స్వాగతించారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు వివరించారు. ఇండియాలో 5జీ వాడకంపై మోదీ స్వయంగా ట్రంప్ కు చెప్పారని, 5జీ వాడకాన్ని విస్తృత పరిచేందుకు అమెరికా సహకరిస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారని, వివిధ అంశాల విషయంలో భారత్ చేపడుతున్న చర్యలపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన తరువాత మోదీ, ట్రంప్ ల మధ్య సమావేశం ఇదే మొదటిది కాగా, ఇంతటి భారీ విజయానికి మీరు అర్హులని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. భారత ప్రజలు సరైన నేతనే ఎన్నుకున్నారని ట్రంప్ కితాబిచ్చారని తెలుస్తోంది.