Andhra Pradesh: గుడ్డ కాల్చి మీద వేయడంలో జగన్ కు జగనే సాటి!: టీడీపీ నేత నారా లోకేశ్ ఎద్దేవా
- చంద్రబాబు నీతి, నిజాయతీ పునాదిగా ఎదిగారు
- రూ.2,636 కోట్ల అవినీతి జరిగిందని సీఎం జగన్ చెబుతున్నారు
- ఇందుకు ఎలాంటి ఆధారాన్ని చూపడం లేదు
- ట్విట్టర్ వేదికగా మండిపడ్డ టీడీపీ నేత
టీడీపీ అధినేత చంద్రబాబు నీతి, నిజాయతీ పునాదిగా ఎదిగారని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ఆయనపై అవినీతి ముద్ర వేయాలనుకునే ఏపీ ప్రభుత్వ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. కనీస ఆధారాలు లేకుండా విద్యుత్ కొనుగోళ్లలో రూ.2,636 కోట్ల అవినీతి జరిగినట్లు సీఎం జగన్ ఆరోపించారని లోకేశ్ గుర్తుచేశారు.
గుడ్డ కాల్చి మీద వేయడంలో జగన్ కు జగనే సాటి అని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ ఏపీకి చెడ్డపేరు తీసుకురావద్దని కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ స్వయంగా మీకు లేఖ రాయలేదా? అని లోకేశ్ ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపామనీ, గత ఐదేళ్లలో రూ.36,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు.
దీనివల్ల రాష్ట్రంలో 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ లోటు 22 మిలియన్ యూనిట్లుగా ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్రం మిగులు విద్యుత్ ను సాధించిందనీ, జాతీయ స్థాయిలో 150కి పైగా అవార్డులు దక్కించుకుందని గుర్తుచేశారు. ఇది టీడీపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.