Karnataka: బెంగళూరులో అపార్ట్ మెంట్లు నిర్మించడంపై నిషేధం విధించాలని సర్కారు యోచన... కారణం ఇదే!
- గార్డెన్ సిటీని వేధిస్తున్న నీటికొరత
- రాష్ట్రంలో కరవు పరిస్థితులు
- బిల్డర్లు, డెవలపర్లతో చర్చించనున్న కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులతో కరవు దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాజధాని బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. కొత్త అపార్ట్ మెంట్లు నిర్మించడంపై ఐదేళ్ల నిషేధం విధించాలన్నది వాటిలో ప్రధానమైనది. చాలామంది అపార్ట్ మెంట్లు నిర్మించి, తాగునీటి సరఫరాపై సరైన ఏర్పాట్లు చేయకుండానే ఫ్లాట్లు విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్ వాసులు మంచినీరు దొరక్క తీవ్ర అగచాట్లు పడుతున్నారు.
దీనిపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి పరమేశ్వర మాట్లాడుతూ, తాగునీటి సరఫరాకు తగిన ఏర్పాట్లు చేయని కారణంగా ఇప్పటికీ అనేకమంది అపార్ట్ మెంట్ ఓనర్లు మంచినీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటినంతా అపార్ట్ మెంట్లకే తరలిస్తున్నారని, తద్వారా కొన్నిప్రాంతాల్లో అసలు నీరే దొరకని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. త్వరలోనే బిల్డర్లు, డెవలపర్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అపార్ట్ మెంట్ నిర్మాణాలపై నిషేధం విధించిన తర్వాత రాబోయే ఐదేళ్లలో కర్ణాటక అనేక తాగునీటి పథకాలను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టనుందని పరమేశ్వర వెల్లడించారు. ఆ తర్వాత నిషేధం ఎత్తివేస్తామని వివరించారు.