PV Narasimharao: ఏఐసీసీ కార్యాలయంలోకి పీవీ భౌతికకాయాన్ని తీసుకెళ్లనివ్వలేదనడానికి అన్ని సాక్ష్యాధారాలున్నాయి: పీవీ మనవడు సుభాష్ ఫైర్

  • పీవీ ఘనతను మోదీ సైతం గుర్తించారు
  • సొంత పార్టీ నేతలు ఇప్పటికీ ఆయన్ను గౌరవించడంలేదు
  • పీవీది తప్ప మాజీ ప్రధానుల సమాధులన్నీ ఢిల్లీలోనే ఉన్నాయి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ఆయన మనవడు సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ, చిందరవందరగా ఉన్న వ్యవస్థలను చక్కదిద్దారని, ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సైతం అంగీకరించినా, సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లో మాత్రం పీవీ ఘనతల పట్ల ఎలాంటి గుర్తింపు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ పీవీ పట్ల అవమానకర రీతిలోనే వ్యవహరిస్తున్నారని సుభాష్ మండిపడ్డారు. నేడు జయంతి సందర్భంగా పీవీకి ఇతర పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ నాయకులు నివాళులు అర్పించినా, కాంగ్రెస్ నేతలు ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పీవీ నరసింహారావు సమాధి తప్ప మిగతా మాజీ ప్రధానుల సమాధులన్నీ ఢిల్లీలోనే ఉన్నాయని, ఇది కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.

ఆనాడు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి పీవీ భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు పార్టీ పెద్దలు అనుమతించలేదడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని సుభాష్ స్పష్టం చేశారు. పీవీకి కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సముచితస్థానం ఇవ్వలేదని, ఈ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పీవీ మనవడు సుభాష్ కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News