Rahul Gandhi: రాహుల్ గాంధీ మెట్టు దిగుతారనుకోవడంలేదు: వీరప్ప మొయిలీ
- ఆయన అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు లేనట్టే
- కొత్త అధినేత విషయంలో వర్కింగ్ కమిటీదే తుది నిర్ణయం
- రాహుల్ కోసం నేతల రాజీనామాలు
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి నైతికబాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీనే పార్టీ చీఫ్ గా కొనసాగాలంటూ అత్యధికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క శుక్రవారం నాడే రాహుల్ కోసం 145 మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామాలతోనైనా రాహుల్ మనసు మార్చుకోవాలని వారు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తన నిర్ణయంపై మెట్టు దిగుతారని భావించడంలేదని, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం దాదాపు లేనట్టేనని స్పష్టం చేశారు. పార్టీకి కొత్త అధినేత విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ ప్రతిపాదనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినా రాహుల్ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.