Madhya Pradesh: నాలుగేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో యువకుడి మిస్సింగ్.. పాకిస్థాన్ జైలులో ప్రత్యక్షం
- 2015లో ఉన్నట్టుండి మాయమైన యువకుడు
- కేంద్రానికి పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల జాబితా
- అందులో అదృశ్యమైన యువకుడి పేరు
నాలుగేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో అదృశ్యమైన యువకుడు తాజాగా పాకిస్థాన్ జైలులో ఉన్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రేవా జిల్లాలోని సహడ్నా గ్రామానికి చెందిన 24 ఏళ్ల అనిల్ సాకేత్ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. అతడి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు సంబంధించిన జాబితా భారత్‌కు అందింది. అందులో 2015లో మధ్యప్రదేశ్‌లో అదృశ్యమైన సాకేత్ పేరు ఉండడం చూసి ప్రభుత్వం ఆశ్చర్యపోయింది.
పాకిస్థాన్‌కు అతడు ఎలా వెళ్లాడు? ఎందుకు జైలుపాలయ్యాడన్న వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో అతడికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఆరా తీస్తోంది. 15 జనవరి 2015లో అనిల్ సాకేత్ అదృశ్యమైనట్టు రేవారి ఎస్పీ అబిద్ ఖాన్ తెలిపారు. కనిపించకుండా పోయిన తమ కుమారుడు బతికే ఉన్నాడని తెలిసిన కుటుంబ సభ్యులు ఓవైపు సంతోషపడుతున్నా, పాకిస్థాన్‌లోని లాహోర్ జైల్లో ఉన్న అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియక ఆవేదనలో వున్నారు.