rajnadhsingh: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఏపీ సీఎం జగన్ నేడు విశాఖ రాక
- తూర్పు నౌకాదళంలో జరిగే కార్యక్రమాలకు హాజరు
- రాత్రికి విజయవాడ తిరిగి వెళ్లనున్న ముఖ్యమంత్రి
- ఆదివారం వరకు విశాఖలోనే రాజ్‌నాథ్
విశాఖలోని తూర్పు నౌకాదళం (ఈఎన్సీ) ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈరోజు విశాఖ వస్తున్నారు. మధ్యాహ్నం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజ్‌నాథ్‌సింగ్ నగరానికి చేరుకుంటుండగా, రాత్రి ఏడు గంటలకు సీఎం జగన్ రానున్నారు.
ఈఎన్సీ ప్రధాన కార్యాలయాల్లో ఒకటైన కల్వరిలోని స్వర్ణజయంతి ఆడిటోరియంలో జరిగే సమావేశంలో ఇద్దరు నేతలు పాల్గొంటారు. అనంతరం జరిగే విందుకు హాజరవుతారు. కేంద్ర మంత్రి రాత్రికి అక్కడే బస చేయనుండగా, సీఎం జగన్ రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్తారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాజ్‌నాథ్ తొలిసారి విశాఖ విచ్చేస్తుండగా, ముఖ్యమంత్రి హోదాలో జగన్ రావడం ఇది రెండోసారి. గతంలో శారదా పీఠంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ తొలిసారి వచ్చారు.
కాగా, రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ఉదయం ఐఎన్ఎస్ డేగా నుంచి బయలుదేరి ఈఎన్సీ ప్రధాన కేంద్రానికి చేరుకుని నౌకలను సందర్శిస్తారు. నావికులు, నేవీ అధికారులు, నేవీ సివిలియన్ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్తారు.