Andhra Pradesh: ‘ఆంధ్రజ్యోతి’కి పాకిన కూల్చివేతల సెగ.. అక్రమంగా భవనాన్ని కట్టారని అధికారుల నోటీసులు!
- తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామంలో నిర్మాణం
- వెంటనే ఈ భవనాన్ని తొలగించాలని నోటీసులు
- లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై సీఎం జగన్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో టీడీపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం, కరకట్ట ప్రాంతంలోని మిగతా అక్రమ నిర్మాణాలపై కూడా దృష్టి సారించింది. తాజాగా ఈ అక్రమ నిర్మాణాల సెగ ప్రముఖ దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’కి కూడా తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అనుమతులు తీసుకోకుండానే గాల్వాల్యం షీట్ భవనాన్ని నిర్మించారని గోదావరి డెవలప్ మెంట్ అథారిటీ(గుడా) నోటీసులు జారీచేసింది.
ఎలాంటి అనుమతులు లేకుండా 1.75 ఎకరాల విస్తీర్ణంలో రెండంతస్తులతో ఈ ప్రింటింగ్ ప్రెస్ ను నిర్మించారని గుడా తెలిపింది. నోటీసులు అందుకున్న వెంటనే ఈ భవనాన్ని తొలగించాలనీ, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు గుడా నోటీసులు జారీచేసింది. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే నోటీసులు అందించిన వారం రోజుల్లోగా స్పందించాలని ఈ ప్రొవిజనల్ ఆర్డరులో పేర్కొన్నారు.