Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ!
- జగన్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది
- ఖరీఫ్ ఆరంభమైనా ఇంకా విత్తనాలు ఇవ్వలేదు
- వెంటనే ప్రభుత్వం మేల్కొని సమస్యపై దృష్టిసారించాలి
తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ రైతులను ఇబ్బంది పెడుతోందని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఇది ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతున్నా, రైతులకు విత్తనాలు అందించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతు సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు.
ప్రస్తుతం విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కే దుస్థితి వచ్చిందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఏజెన్సీలకు విత్తన సరఫరా బాధ్యతలు ఇవ్వకపోవడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందేవని గుర్తుచేశారు. ప్రస్తుతం పల్లెల్లో విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బాలకృష్ణ విమర్శించారు. టీడీపీ హయాంలో విద్యుత్ కోత అన్నది లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేశామని లేఖలో పేర్కొన్నారు.