Andhra Pradesh: ఏపీ బోర్డర్ దాటగానే సీఎం జగన్ కు నోరు ఎందుకు రావడం లేదు?: టీడీపీ నేత దేవినేని ఉమ
- సాగునీటి ప్రాజెక్టులపై సీఎం మౌనం మంచిది కాదు
- రాష్ట్ర రైతాంగానికి ఆయన జవాబు ఇవ్వాలి
- చంద్రబాబు దూరదృష్టితో ప్రాజెక్టులను ప్రారంభిస్తే ఆపేశారు
సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌనం మంచిది కాదని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయడంపై జగన్ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఏపీ ముఖ్యమంత్రిగా మీరు(జగన్) తెలంగాణ వెళ్లి మా రాష్ట్రంలో ఈ పనులు జరుగుతున్నాయని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఎందుకున్నారు? గోదావరి-పెన్నా అనుసంధానం పనులను ఎందుకు ఆపేశారు? పెన్నా రైతులు, రాయలసీమ రైతులు మీకు ఏం అన్యాయం చేశారు’ అని ఉమ నిలదీశారు.
విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో భూగర్భ జలాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై చంద్రబాబు ఆలోచించారని ఉమ తెలిపారు. ‘తమిళనాడు, బెంగళూరులో నీళ్ల కోసం ప్రజలు రోడ్డు ఎక్కి పోరాటాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దూరదృష్టితో ఏపీలో అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. సీఎం జగన్ ను నేను ఒక్కటే అడుగుతున్నా. రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్ వంటి సుభాషితాలు మాట్లాడుతున్న సీఎం జగన్ కు ఏపీ బోర్డర్ దాటగానే నోరు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు.