kcr: కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్ట్.. ఆయన సంగతి చూస్తా: భట్టి
- పీసీసీ రేసులో నేను లేను
- సీఎల్పీ నేతగా కేసీఆర్ పై పోరాటం చేస్తా
- తెలంగాణ ప్రాధాన్యతలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు
వారం రోజుల పాటు తాను ఢిల్లీలో ఉన్న మాట వాస్తవమేనని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పార్టీ నేతలంతా ఢిల్లీలో ఉన్నారని... వారిని కలిసి, పార్టీ విషయాలను చర్చించేందుకే తాను ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తాను కూడా ఉన్నాననే వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ అనే పొలిటికల్ టెర్రరిస్టు యత్నిస్తున్నారని... సీఎల్పీ నేతగా సభలోను, సభ బయట ఆయనపై పోరాటం చేస్తానని భట్టి చెప్పారు. సీఎల్పీ నేతగా పార్టీ అధిష్ఠానం తనకు ఒక బాధ్యతను అప్పజెప్పిందని... కేసీఆర్ పై పోరాడకుండా, వెన్నుచూపి వెళ్లిపోయి, పీసీసీ అధ్యక్ష పదవిని అడిగే నాయకుడిని తాను కాదని అన్నారు. కేసీఆర్ అవినీతిని, విధ్వంసాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తానని... ఆయన సంగతి చూస్తానని అన్నారు. నీరు, నిధులు, ఉద్యోగాలు తెలంగాణకు తొలి ప్రాధాన్యతలని... వీటిని గాలికొదిలేసి కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని మండిపడ్డారు. ముందు పేదలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.