Bhutan: నమ్మగలరా?... ఇక్కడ ఐఏఎస్ లకన్నా టీచర్లకే వేతనాలు ఎక్కువ!
- భూటాన్ లో వేతన సంస్కరణలు
- ఉపాధ్యాయ, వైద్యులకు భారీ వేతనాలు
- క్యాబినెట్ కార్యదర్శికన్నా, ఈఎస్ 1 గ్రేడ్ డాక్టర్, టీచర్ కు అధిక వేతనం
ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్, అదే ప్రాంతంలో ఐఏఎస్ అధికారికన్నా అధిక వేతనాన్ని తీసుకుంటున్నారు. నూతన వేతన సవరణలో విద్యా రంగానికి భూటాన్ పెద్ద పీట వేయగా, ఉపాధ్యాయుల వేతనాలు సివిల్ సర్వీస్ అధికారులకన్నా పెరగనున్నాయి. ఇదే సమయంలో వైద్య రంగంలోనూ ఇదే విధమైన సంస్కరణలకు భూటాన్ సర్కార్ తెరలేపింది. తాజా నిర్ణయాల ప్రకారం, పదేళ్ల కన్నా తక్కువ అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు 35 శాతం, ఆపై 20 ఏళ్ల వరకూ 45 శాతం, 20 ఏళ్లకు మించి సర్వీస్ చేస్తే 55 శాతం వృత్తి భత్యాన్ని అందించనున్నారు.
దీని ప్రకారం లెక్కగడితే, పీ5 గ్రేడ్ ఉద్యోగికి 29,935 గల్ ట్రమ్ (భూటాన్ కరెన్సీ) కన్నా ఎక్కువ వేతనం లభించనుంది. ఇదే సమయంలో పీ3 ఐఏఎస్ ఆఫీసర్ వేతనం 28,315 గల్ ట్రమ్ గా ఉండనుంది. ప్రభుత్వంలో డైరెక్టర్ హోదాలో ఉన్న ఐఏఎస్ కు 44,120 గల్ ట్రమ్ ల వేతనం ఉండగా, పీ2 గ్రేడ్ టీచర్, వైద్యుల వేతనం 46,835 గల్ ట్రమ్ వేతనం రానుంది. భూటాన్ ప్రభుత్వంలో అత్యధిక వేతనం పొందే కేబినెట్ సెక్రటరీ ఉద్యోగానికి 82 వేలకుపైగా వేతనం ఉండగా, తాజా వేతన సవరణల తరువాత ఈఎస్1 గ్రేడ్ పొందిన డాక్టర్లు 90 వేలకుపైగా వేతనాన్ని పొందనుండటం గమనార్హం.