Narendra Modi: రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్'
- రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి 'మన్ కీ బాత్'
- నీటి వినియోగం, నిల్వలపై అవగాహన పెరగాలి
- ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించిన ప్రధాని
"నేను మరోసారి ప్రజల ముందు కొన్ని నెలల తరువాత వస్తాను అని ఫిబ్రవరిలో వ్యాఖ్యానిస్తే, కొంతమంది నాకు అతి నమ్మకం అన్నారు. కానీ, నేను అన్ని వేళలా భారత ప్రజలపై నమ్మకం ఉంచాను. ఆ నమ్మకమే నన్ను నేడు ఈ స్థాయిలో నిలిపింది" అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, తొలిసారిగా 'మన్ కీ బాత్'లో ఈ ఉదయం నరేంద్ర మోదీ మాట్లాడారు.
దేశంలోని నీటి కష్టాలను తన ప్రసంగంలో అధికంగా ప్రస్తావించిన నరేంద్ర మోదీ, ఈ సమస్య తీరేందుకు ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. గత కొన్ని నెలలుగా ఎంతో మంది నీటి కష్టాలపై తనకు లేఖలు రాశారని మోదీ తెలిపారు. నీటి నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, నీటి నిల్వలను పెంచుకోవడంపై గ్రామ పంచాయితీలకు తాను లేఖలు రాశానని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నీటిపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని మోదీ వ్యాఖ్యానించారు.
నీటిని నిల్వ చేసేందుకు ఒక నియమిత విధానం అంటూ ఏమీ లేదని, ఎన్నో రకాల పద్ధతుల్లో నీటిని నిలుపుకుని, భవిష్యత్ లో వాడుకోవచ్చని ప్రధాని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎన్జీవో సంస్థలు, వ్యక్తులు కృషి చేయాలని సూచించారు.