Telangana: జులై 10 లోపే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలి: కేటీఆర్
- ముప్పై శాతం క్రియాశీల సభ్యత్వం ఉండేలా చూడాలి
- పత్రాలన్నీపక్కాగా పూర్తి చేస్తేనే బీమా వర్తింపు
- పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ ఇన్ ఛార్జిలకు సూచనలు
జులై 10 లోపే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్ లో పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ ఇన్ ఛార్జిల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదులో పత్రాలన్నీపక్కాగా పూర్తి చేస్తేనే బీమా వర్తిస్తుందని, ముప్పై శాతం క్రియాశీల సభ్యత్వం ఉండేలా చూడాలని అన్నారు.
సభ్యత్వ నమోదు తర్వాత గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు 51 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల లోపే కమిటీలు పూర్తి చేయాలని, క్యాడర్ బేస్డ్ పార్టీగా టీఆర్ఎస్ ను తీర్చిదిద్దుదామని పిలుపు నిచ్చారు. సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ ఇన్ చార్జ్ గా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇండిపెండెంట్ గా పని చేసిన మహిళలకు కమిటీల్లో స్థానం ఇవ్వాలని, ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఇందుకోసం సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.