Andhra Pradesh: పాలకొల్లులో ‘ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్’.. ప్రారంభించనున్న పవన్ కల్యాణ్!
- ప్రిన్సిపాల్ గా రాజా వన్నెంరెడ్డి
- నటన, దర్శకత్వంలో శిక్షణ
- చైర్మన్ గా హరిరామజోగయ్య
అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి సినీ దిగ్గజాలు పాలకొల్లు నుంచి వచ్చారని జనసేన పార్టీ తెలిపింది. ఎందరో సినీ కళాకారులకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించబోతున్నామని వెల్లడించింది. ఈ సంస్థకు ‘ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్’గా నామకరణం చేశామని చెప్పింది. ఈ విషయమై పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ స్పందిస్తూ.. ఈ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు హరిరామజోగయ్య చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు.
రాజా వన్నెంరెడ్డి, బన్నీవాసు నేతృత్వంలో ఈ ఇన్ స్టిట్యూట్ నడుస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఈ సంస్థను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ ఇన్ స్టిట్యూట్ లో నటన, దర్శకత్వంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా రాజా వన్నెంరెడ్డి వ్యవహరిస్తారనీ, సంస్థ ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ వస్తారని ప్రకటించారు. విద్యార్థులకు సినీరంగంలో మెలకువలు నేర్పించే ఫ్యాకల్టీ ఇప్పటికే సిద్ధమయిందని తెలిపారు.