Donald Trump: ఇప్పటివరకు ఉత్తరకొరియా గడ్డపై కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు లేరు... ట్రంప్ చాలా ధైర్యంచేశారు: కిమ్
- ఒక్క ట్వీట్ తో పరిస్థితిలో మార్పు తెచ్చిన ట్రంప్
- ట్రంప్ ట్వీట్ కు ఉత్తర కొరియా సానుకూల స్పందన
- సరిహద్దుకు తరలివచ్చిన కిమ్ జోంగ్ ఉన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ దూకుడు అందరికీ తెలిసిందే. ఆయన తాను అనుకున్న పని ఎట్టి పరిస్థితిల్లోనూ చేయకుండా మానరు. అయితే, తన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారని పేరుంది. తాజాగా, జపాన్ లో జి-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చి ట్విట్టర్ లో అప్పటికప్పుడు చేసిన ఓ ట్వీట్ చారిత్రక సంఘటనకు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు... ఒక్క ట్రంప్ తప్ప!
నా ఈ ట్వీట్ ను ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ గనుక చూస్తే ఆయనకో విజ్ఞప్తి! కిమ్ ను దేశ సరిహద్దుల్లోని నిస్సైనిక మండలంలో కలిసి హలో అంటూ కరచాలనం చేయాలనుకుంటున్నాను అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి ఇదో ఆసక్తికరమైన ప్రతిపాదన అంటూ స్పందించింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.
ట్రంప్ జపాన్ నుంచి దక్షిణ కొరియాలో అడుగుపెట్టి ఆపై ఉత్తర కొరియా సరిహద్దులోని నిస్సైనిక ప్రాంతంలో అడుగుపెట్టగా, ఆయనకు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశ భూభాగంలోకి స్వాగతం పలకడం చరిత్ర పుటలకెక్కింది. ఆపై ఇరువురు కరచాలనం చేసుకుని కాసేపు మాట్లాడుకుని ఈసారి దక్షిణ కొరియా భూభాగంలోకి ప్రవేశించారు. అక్కడ వారికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తోడయ్యారు.
దీనిపై ట్రంప్ స్పందిస్తూ, ప్రపంచానికి ఇదో గొప్ప సుదినం అని, తాను ఇక్కడికి రావడాన్ని మహా గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అటు కిమ్ మాట్లాడుతూ, ఓ అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా గడ్డపై కాలుమోపడం ఇదే ప్రథమం అని, ట్రంప్ చాలా ధైర్యంగా వ్యవహరించారని కొనియాడారు.