Andhra Pradesh: జగన్.. మీ తండ్రి ‘యాసిడ్’ దుండగులను కాల్చిచంపారు.. ఇలామీరెప్పుడు చేయబోతున్నారు?: దేవినేని అవినాశ్
- రాజన్న రాజ్యం తెస్తామని చెప్పారు
- మా శ్రేణులపై దాడులు చేస్తున్నారు
- మహిళ ఆత్మహత్య చేసుకునేలా హింసించారు
రాజన్న రాజ్యం తెస్తానని వైసీపీ అధినేతగా సీఎం జగన్ చెప్పిన మాటలను ఏపీ ప్రజలు నమ్మారనీ, భారీ మెజారిటీని కట్టబెట్టారని తెలుగుయువత ఏపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీలో టీడీపీ శ్రేణులపై దాడులు, మహిళలు-చిన్నారులపై అత్యాచారాలు, భవనాల కూల్చివేతలపై వివరణ కోరుతూ అవినాశ్ ఈరోజు ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తాం అన్న జగన్ మాట ఆచరణలో అమలు కావడం లేదని అవినాశ్ విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ బీసీ మహిళను హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేశారనీ, రాజధాని ప్రాంతంలో మరో టీడీపీ బీసీ నేతను హత్య చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఏపీ రావణకాష్టంగా మారితే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నేతలు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల పంటలు కాల్చడాలు, ఇళ్లు కూల్చడాలు, గ్రామ బహిష్కరణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఇప్పటికైనా ఆపాలనీ, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించారు. దాచేపల్లిలో రేప్ కేసు విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరించారనీ, అప్పుడు వైసీపీ నేతలు అల్లరి చేశారని అవినాశ్ గుర్తుచేశారు.
కానీ తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ మైనర్ బాలికను సామూహిక అత్యాచారం చేసిన కేసులో కఠిన చర్యలు ఒక్కటీ తీసుకోలేదన్నారు. ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ పోసిన దుండగులను అప్పటి సీఎం వైఎస్ హయాంలో రోజుల వ్యవధిలోనే కాల్చిచంపారనీ, మీ రాజన్నరాజ్యంలో ఇలాంటి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు. వైఎస్ సీఎం అయ్యాక కేబినెట్ మీటింగ్ పెట్టి మరీ తన అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ చేసుకున్నారనీ, కావాలంటే మంత్రి బొత్సను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు అవినాశ్ తాను రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.