Koneru Konappa: నా తమ్ముడు అటవీ అధికారులపై దాడికి పాల్పడలేదు: ఎమ్మెల్యే కోనప్ప
- ట్రాక్టర్లను ఎందుకు తీసుకొచ్చారు?
- అధికారికి గాయాలవడం బాధాకరం
- అటవీ అధికారులు రాజకీయం చేస్తున్నారు
కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారులపై దాడి విషయమై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి ట్రాక్టర్లను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తన తమ్ముడు అటవీశాఖాధికారులపై దాడికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. కాగజ్‌నగర్‌లో జరిగిన ఘర్షణలో అధికారికి గాయాలవడం బాధకరమని, కానీ అటవీ అధికారులు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
అటవీ అధికారులు నేడు కాగజ్‌నగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న జడ్పీ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ ఆ ప్రాంతానికి వచ్చి పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులకు, కృష్ణ వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రెచ్చిపోయిన కృష్ణ, ఆయన అనుచరులు రేంజ్ అధికారి అనితతో పాటు సిబ్బందిపై దాడి చేశారు.