England: టీమిండియా టార్గెట్ 338 పరుగులు... షమీకి 5 వికెట్లు
- బెయిర్ స్టో సెంచరీ
- స్టోక్స్ మెరుపులు
- బ్యాటింగ్ కు సహకరించిన పిచ్
సొంతగడ్డపై ఇంగ్లాండ్ రెచ్చిపోయి ఆడింది. బర్మింగ్ హామ్ లో టీమిండియాతో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 111 పరుగులతో భారత బౌలింగ్ ను తుత్తునియలు చేయగా, మధ్యలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కాస్త కుదుపులకు లోనైంది. కెప్టెన్ మోర్గాన్ (1) స్వల్ప స్కోరుకే అవుట్ కాగా, బట్లర్ (8 బంతుల్లో 20) మెరుపులు కాసేపే అయ్యాయి. వోక్స్, ప్లంకెట్ నిరాశపర్చినా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం వీరవిహారం చేశాడు. స్టోక్స్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 79 పరుగులు సాధించాడు.
మ్యాచ్ లో హైలైట్ అంటే ఓపెనర్ బెయిర్ స్టో ఇన్నింగ్సేనని చెప్పాలి. బెయిర్ స్టో ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 6 భారీ సిక్సులున్నాయి. బెయిర్ స్టో ధాటికి భారత బౌలర్లు బెంబెలెత్తిపోయారంటే అతిశయోక్తి కాదు. అయితే, ఫామ్ లో ఉన్న మహ్మద్ షమీ మధ్యమధ్యలో వికెట్లు తీస్తుండడంతో ఇంగ్లాండ్ స్కోరు కాస్త తగ్గింది. లేకపోతే ఇంగ్లాండ్ స్కోరు 350 దాటేదనడంలో సందేహంలేదు. పరుగుల వర్షం కురిసిన ఈ ఇన్నింగ్స్ లో కూడా షమీ 5 వికెట్లు సాధించడం అతడి ఫామ్ కు నిదర్శనం.