Asifabad: టీఆర్ఎస్ విచ్చలవిడితనానికి అటవీశాఖ సిబ్బందిపై దాడే నిదర్శనం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది
- కుటుంబ పాలన, అరాచకం, అశాంతి ఎక్కువైంది
- దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
అటవీశాఖ సిబ్బందిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ, వారి అనుచరులు చేసిన దాడిపై టీ-కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాడిని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, విధుల్లో ఉన్న అధికారులపై టీఆర్ఎస్ నేతలు కర్రలతో దాడి చేశారని, జెడ్పీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే సోదరుడు ఇలా దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, అరాచకం, అశాంతి ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ విచ్చలవిడితనానికి ఈ దాడే నిదర్శనమని, మహిళా అధికారిపై దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.