Polavaram: గోదావరిలో తగ్గిన నీరు... పట్టిసీమకు నీరు బంద్!
- పోలవరంలో తగ్గిన నీటి మట్టం
- ఉన్న నీరు గోదావరి జిల్లాలకే
- మోటార్లను ఆపేసిన అధికారులు
గోదావరికి ఈ సీజన్ లో ఇంకా వరద రాకపోవడంతో, చాలినంత స్థాయిలో నీరు లేక, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా నదికి నీటి విడుదల నిలిచిపోయింది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 13.95 అడుగులకు చేరగా, ఈ నీరు ఉభయ గోదావరి జిల్లాల ఆయకట్టుకు సాగునీటి నిమిత్తం మాత్రమే సరఫరాకు సరిపోతుందని భావించిన అధికారులు, పట్టిసీమ ఎత్తిపోతల మోటార్లను నిలిపివేశారు. ఈ విషయాన్ని ధవళేశ్వరం హెడ్ వాటర్ వర్క్స్ ఎస్‌ఈ ఎన్ కృష్ణమూర్తి వెల్లడించారు. గత నెల 26 నుంచి రెండు పైపుల ద్వారా రోజుకు 700 క్యూసెక్కుల నీటి చొప్పున 5 రోజుల్లో 3,500 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి విడుదల చేశామని తెలిపిన ఆయన, ప్రస్తుతం మోటార్లను ఆపేశామని అన్నారు. ఎగువన వర్షాలు కురిసి, తిరిగి వరద నీరు చేరితే, కృష్ణానదికి నీటిని విడుదల చేస్తామన్నారు.