Road Accident: జమ్ముకశ్మీర్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది దుర్మరణం
- 13 మందికి తీవ్రగాయాలు
- అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయిన ప్రయాణికుల బస్సు
- నాలుగు రోజుల వ్యవధిలో రెండో ఘోర ప్రమాదం
జమ్ము కశ్మీర్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు లోయలోకి దూసుకుపోయిన ఘటనలో 31 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం ఇదే రాష్ట్రంలోని పోషియాన్ జిల్లాలో ఓ బస్సు లోయలోపడిన ఘటనలో 9 మంది బాలికలతో సహా మొత్తం 11 మంది విద్యార్థులు దుర్మరణం పాలయిన విషయం తెలిసిందే. పూంచ్‌కు చెందిన ఓ కంప్యూటర్ సెంటర్ విద్యార్థులైన వీరు విహార యాత్రకు వెళ్తుండగా ఘోరం జరిగింది.
ఇంతలోనే మళ్లీ ఈ రోజు మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేశ్వాన్ నుంచి కిష్త్వార్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 31 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఘటన జరిగిన సమయానికి బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీశామని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు.