Chandrababu: కాపు నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ నేడు
- గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశం
- ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించే అవకాశం
- అసంతృప్త నేతలను బుజ్జగించనున్న అధినేత
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పార్టీ కాపు సామాజిక వర్గం నేతలతో సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఇటీవల పార్టీ పరంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై ఈ సమావేశంలో అధినేత కాపు నాయకులతో చర్చించే అవకాశం ఉంది.
చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా పార్టీకి చెందిన బోండా ఉమ, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితర కాపు నాయకులు కాకినాడలో భేటీ అయిన విషయం తెలిసిందే. పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో వీరి అడుగులు కూడా అటువైపే అన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే సమావేశం అనంతరం కాపు నేతలు అంతర్గత అంశాలపై చర్చించేందుకే తాము సమావేశమయ్యామని, పార్టీ మారే యోచన తమకు లేదని స్పష్టం చేశారు.
కానీ చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ప్రజావేదిక కూల్చివేత నేపథ్యంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి కాపు నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమయ్యింది. దీంతో వీరు పార్టీ మారే అవకాశాలపై ఇంకా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించాలని చంద్రబాబు వారితో భేటీ కావాలని నిర్ణయించారు. అసంతృప్త నేతలతో చర్చించి వారిని బుజ్జగించే అవకాశం ఉంది.